తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్త సమష్టి కృషి అవసరం: జయ పీసపాటి
సింగపూర్‌లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలికి ఘన సత్కారం
సింగపూర్ (ప్రత్యేక ప్రతినిధి):
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు సజీవంగా అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా సమష్టిగా కృషి చేయాలని హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనకు విచ్చేసిన ఆమె గౌరవార్థం ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో ఆదివారం సరిగమ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. శ్రీ సుబ్బు వి. పాలకుర్తి సమర్థవంతమైన నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు, తెలుగు ప్రముఖులు సుమారు 25 మంది హాజరయ్యారు.
ప్రతి ఇంటా తెలుగు వెలుగులు నిండాలి:
సభా ప్రాంగణంలో ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించిన అనంతరం జయ పీసపాటి ప్రసంగిస్తూ, హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావ నేపథ్యాన్ని, గత 22 సంవత్సరాలుగా ప్రవాసంలో సమాఖ్య ద్వారా చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను వివరించారు. మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజానికి మార్గదర్శకంగా నిలవవచ్చన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రతి కుటుంబంలో పిల్లలకు తెలుగు నేర్పించాలని, తద్వారా వారికి మాతృభాషపై మక్కువ పెరగడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. వారాంతపు రోజున కూడా ఇంతమంది తెలుగు ప్రముఖులు ఒకచోట చేరి ఆత్మీయతను చాటడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ, సింగపూర్ – హాంకాంగ్ తెలుగు సంస్థల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
మలేషియా స్ఫూర్తి.. సింగపూర్‌తో ప్రత్యేక అనుబంధం:
విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తాను తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని, నాటినుంచే సింగపూర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని జయ పీసపాటి గుర్తుచేసుకున్నారు. సింగపూర్ తెలుగువారి ఐక్యత తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు బెంచ్‌మార్క్‌గా నిలిచాయని కొనియాడారు. అక్కడి చిన్నారులు స్పష్టమైన ఉచ్ఛారణతో తెలుగు మాట్లాడటమే కాకుండా పద్యాలు, గద్యాలను అద్భుతంగా గానం చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని, అదే స్ఫూర్తితో అన్ని దేశాల్లోనూ తెలుగు సంస్కృతి పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
అందరికీ ఆత్మీయ ‘జయక్క’: రత్నకుమార్ కవుటూరు
శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ, 2016లో ఏర్పడిన పరిచయం అనంతరం అంతర్జాల వేదికల ద్వారా మరింత బలపడిందని తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టినా జయ పీసపాటి గారి అమూల్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆమె తమందరికీ ఆత్మీయమైన ‘జయక్క’గా నిలిచారని ప్రశంసించారు. ఆమె ఆలోచనలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహించే కార్యక్రమాలు తమకు నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలుగుదనం, భాషాభిమానం వెల్లివిరిసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లిలతో పాటు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అతిథులకు నిర్వాహకులు ప్రత్యేక అల్పాహార విందును ఏర్పాటు చేశారు.
పురుషోత్తం నారగౌని (8897388393 )
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad









