తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక – కాళోజీ : మంత్రి జూపల్లి

సాహిత్యం Telangana

రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు

ఆర్‌. విద్యార్థికి కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం

సామాన్యుడి గొంతుకగా నిలిచిన మహాకవి ఆశయాలకు రవీంద్రభారతి వేదికగా ఘన నీరాజనం. తెలంగాణ భాషకు యాసకు పట్టంకట్టిన ప్రజాకవి స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజపు కుళ్లును ప్రశ్నిస్తున్న అరుదైన సైనిక కవి డాక్టర్ వి ఆర్ విద్యార్థి (వేలూరి రాములు)కి 2026 రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని మేల్కొల్పిన అద్భుతమైన అక్షర పండుగ.

  • భాష కేవలం సంభాషణకు సాధనం కాదని అదొక జాతి ఆత్మగౌరవానికి జీవన విధానానికి ప్రతీక అని విశ్లేషించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

  • కాళోజీ సాహిత్య వారసత్వాన్ని వి ఆర్ విద్యార్థి లాంటి కవులు పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్ష.

  • ఓటేసిన వాళ్ల చేతులు నరుకుతాం అని సాయుధులు బెదిరించినా నిర్భయంగా ఎదురువెళ్లిన అపర ధైర్యశాలి కాళోజీ అని గుర్తుచేసిన సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి.

  • ముప్పై ఏళ్ల క్రితం రాసిన కవిత్వం నేటికీ సమాజానికి వర్తిస్తోందని బాధపడుతూ అవార్డుల వేదికపై భోరున విలపించిన కాళోజీ మానవతా దృక్పథాన్ని వివరించిన ఫౌండేషన్ కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు.

  • ఆడపిల్లలు ఎప్పుడూ భయపడకూడదని చిన్నతనంలో కాళోజీ తనకు నూరిపోసిన ఆ ధైర్యమే సమాజం ముందు తనను తలెత్తుకునేలా చేసిందని భావోద్వేగానికి గురైన సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జీవీ వెన్నెల.

  • ఏనాడు ఎవడికీ తలవంచని కాళోజీ వారసుడిగా తుది శ్వాస వరకు పీడిత ప్రజల పక్షానే తన కలం నిలబడుతుందని వేదిక మీద గళమెత్తిన పురస్కార గ్రహీత సైనిక కవి డాక్టర్ వి ఆర్ విద్యార్థి.

    ప్రజాకవికి అక్షర నీరాజనం

    పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని గర్జించాడు ఆనాటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. కానీ నేటి సమాజం ఎలా తయారైంది. పుట్టుక నాది చావు నాది ఈ బతుకంతా నాకే కావాలి అన్నంత కుత్సితమైన స్వార్థంలో కూరుకుపోయింది. నాడు నిజాం అరాచకాలపై నిప్పులురిగిన కాళోజీ ఆశయాలకు పాతర వేస్తున్న నేటి కల్తీ సమాజంపై రవీంద్రభారతి వేదికగా సాగిన అక్షర దండయాత్రకు బుధవారం జరిగిన కాళోజీ పురస్కార ప్రదానోత్సవం సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఒకవైపు తుపాకీ పట్టి శత్రువులతో పోరాడి మరోవైపు కలం పట్టి సమాజంలోని చీకట్లతో పోరాడిన అరుదైన సైనిక కవి ఖండాంతర కవి డాక్టర్ వి ఆర్ విద్యార్థి (వేలూరి రాములు)కి రాష్ట్ర ప్రభుత్వం 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని అందించి అక్షరానికి నిజమైన పట్టాభిషేకం చేసింది.

    కాళోజీ కేవలం ఒక కవి మాత్రమే కాదు అదొక నిరంతర చైతన్య స్వరం. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయనొక సజీవ ప్రతీక. ఈ అక్షర పండుగలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కాళోజీ ఆశయాలను అద్భుతంగా విశ్లేషించారు. ఆయన రాసిన నా గొడవ కేవలం ఒక వ్యక్తి గొడవ కాదని అణగారిన సామాన్య ప్రజల గొడవను తన గొడవగా ఆయన స్వీకరించారని గుర్తుచేశారు. తెలంగాణ యాస కాళోజీ శ్వాస అని అభివర్ణించిన మంత్రి పండితులు మాట్లాడే బడి పలుకుల భాష కంటే సామాన్యుడి నాలుకపై నడయాడుతున్న పలుకుబడుల భాషకే కాళోజీ జీవితాంతం పెద్దపీట వేశారని విశ్లేషించారు. అవతలి వారికి అర్థమవుతుందా అని ముందే ఆలోచించి మనల్ని మనం తక్కువ చేసుకునే బానిస భావన పోవాలని కాళోజీ ఆనాడే చాటిచెప్పారని తెలంగాణ మాండలికాన్ని తక్కువ చేసి చూసిన అహంకారులకు తన కలంతోనే బుద్ధి చెప్పారని జూపల్లి కొనియాడారు. వి ఆర్ విద్యార్థి లాంటి కవులు కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

    అక్షరానికి ఆయుధానికి ఉన్న తేడాను చెరిపేసిన అసలైన దేశభక్తుడు వి ఆర్ విద్యార్థి. యుద్ధ భూమిలో ఉంటూనే కవిత్వం రాసి కాళోజీకి పంపిన అక్షర యోధుడు ఆయన అంటూ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విద్యార్థి నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరినీ రోమాంచితం చేసింది. ఇదే వేదిక మీద కాళోజీ ధిక్కార స్వభావాన్ని నరసింహారెడ్డి కళ్లకు కట్టారు. ఎన్నికల్లో ఓటేసిన వాళ్ల చేతులు నరుకుతాం అని సాయుధులు ప్రకటన ఇస్తే దానికి ఏమాత్రం భయపడకుండా నేరుగా వెళ్లి ఓటేసి వచ్చి చేతనైతే నా చేయి నరకండి అని ఎదురువెళ్లిన అపర ధైర్యశాలి కాళోజీ అని గుర్తుచేశారు.

    మన చుట్టూ ఉన్న వ్యవస్థ ఎంతగా కుళ్లిపోయిందో చెప్పడానికి కాళోజీ జీవితంలోని ఒక సంఘటనను కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు పంచుకున్న తీరు సభికుల ను ఆకట్టుకుంది . మద్రాసులో అవార్డు తీసుకుంటున్న సమయంలో కాళోజీ భోరున విలపించారట. ముప్పై ఏళ్ల క్రితం తాను రాసిన కవిత్వం నేటికీ సమాజానికి అద్దం పడుతోందని నిర్వాహకులు మెచ్చుకుంటే సమాజంలో అన్యాయాలు ఇంకా అలాగే ఉన్నాయని తన అక్షరానికి ప్రయోజనం నెరవేరలేదని కన్నీరు పెట్టుకున్న నిజమైన మానవతావాది కాళోజీ అని ఆయన విశ్లేషించారు.

    గొప్ప మహానుభావులు ఎప్పటికీ మరణించరు వాళ్లు ప్రజల గుండెల్లో శాశ్వతంగా జీవించే ఉంటారు అనడానికి సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జీవీ వెన్నెల పంచుకున్న చిన్ననాటి జ్ఞాపకమే సజీవ సాక్ష్యం. తన చిన్నతనంలో కాళోజీ తమ ఇంటికి వచ్చినప్పుడు తలుపు చాటు నుంచి భయపడుతూ చూస్తున్న తనను ఆయన దగ్గరకు పిలిచారట. ఆడపిల్లలు ఎప్పుడూ భయపడకూడదని దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన నూరిపోసిన ఆ ధైర్యమే నేడు తనను సమాజం ముందు తలెత్తుకుని నిలబడేలా చేసిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

    ఏనాడు ఎవడికీ తలవంచని వాడు ప్రజల నాలుకలపై నిలబడగలవాడు మాత్రమే నిజమైన కవి అన్న కాళోజీ అడుగుజాడల్లో నడుస్తున్న వి ఆర్ విద్యార్థి ప్రసంగం ఈ సభకు అద్భుతమైన ముక్తాయింపునిచ్చింది. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడిన తాను ఇప్పుడు సమాజంలో ఉన్న అసమానతలతో అక్షరాల సాక్షిగా పోరాడుతున్నానని తన తుది శ్వాస వరకు పీడిత ప్రజల పక్షానే తన కలం నిలబడుతుందని ఆయన గళమెత్తిన తీరు చూస్తుంటే కాళోజీ వారసత్వం అక్షరాలా సరైన చేతుల్లోనే ఉందన్న భరోసా ప్రతి ఒక్కరిలో వ్యక్తమైంది. నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ అవార్డుల పండుగ నేటి కలుషిత సమాజానికి ఒక నిఖార్సైన మేలుకొలుపు.

  • – పురుషోత్తం నారగౌని ( 8897388393)

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *