డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డు కీలక సమావేశం జరిగింది. నాట్స్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కిషోర్ కంచర్ల నేతృత్వంలో డాలస్ నగరంలో మొట్టమొదటి కార్యవర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది కేవలం ఒక సమావేశంగానే కాకుండా, రాబోయే రెండేళ్లలో తెలుగు వారి కోసం నాట్స్ చేయబోయే అద్భుతమైన కార్యక్రమాలకు పునాదిగా నిలిచింది.
30 రాష్ట్రాల నుండి తరలివచ్చిన ప్రతినిధులు
జనవరి 1 నుండి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషోర్ కంచర్ల ఆహ్వానం మేరకు, అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కార్య నిర్వాహక సభ్యులు, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు డాలస్‌కు తరలివచ్చారు. సుమారు 60 మందికి పైగా కీలక సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో నాట్స్‌ను అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, నాట్స్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు జరిగాయి.
సేవ, సంస్కృతి పరిరక్షణే ధ్యేయం:
“భాషే రమ్యం – సేవే గమ్యం” అనే నినాదాన్ని విధానంగా మార్చుకుని నాట్స్ పని చేస్తుందని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. రాబోయే రోజుల్లో తన సేవా పరిధిని మరింత విస్తరించాలనే లక్ష్యంతో పనిచేద్దామని కిషోర్ నాట్స్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలు జరుగుతుంటాయని, అయితే ఈసారి కొత్త నాయకత్వం ఉత్సాహవంతములైన కొత్త సభ్యుల చేరికతో సమావేశం మరింత ఫలప్రదంగా జరిగిందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ ఎప్పుడూ మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే ‘మహిళా సంబరాలు’, ‘బాలల సంబరాలు’ వంటి కార్యక్రమాలను మరింత వినూత్నంగా నిర్వహించాలని నాట్స్ బోర్డ్ సభ్యులు బిందు యలమంచిలి తెలిపారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
