బాటాతో నా అనుబంధం మరువలేను

Bay Area NRI News United States USA

శాన్ హోసేలో మరోసారి సంగీత సందడి చేసేందుకు సిద్ధమైన దేవిశ్రీ ప్రసాద్

శాన్ హోసే: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే శాన్ హోసే చేరుకున్నారు.

ఈ సందర్భంగా హోటల్ షెరాటన్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బారావు చెన్నూరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో దేవిశ్రీ ప్రసాద్ తన అమెరికా పర్యటనలు, బాటాతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు అమెరికాకు ఐదారు సార్లు వచ్చాను. న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, డల్లాస్‌తో పాటు అనేక నగరాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించాను. ప్రతి పర్యటనలో అన్ని నగరాలను కవర్ చేయడం సాధ్యం కాకపోయినా, శాన్ హోసే మాత్రం ఎప్పుడూ నా షెడ్యూల్‌లో తప్పకుండా ఉంటుంది. దానికి ప్రధాన కారణం బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా). ఇక్కడి నిర్వాహకులు, తెలుగు కమ్యూనిటీ చూపించే ప్రేమ, ఆదరణ నాకు ఎంతో ప్రత్యేకం. అందుకే బాటాతో నా అనుబంధం మరువలేనిది” అని అన్నారు.

అంతేకాకుండా, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాటా చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా బాటా మాజీ అధ్యక్షుడు శ్రీలు వెలిగేటి, 2008లో బాటా ఆధ్వర్యంలో జరిగిన దేవిశ్రీ ప్రసాద్ తొలి అమెరికా సంగీత కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను చూపించారు. ఆ ఫొటోను చూసిన దేవిశ్రీ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేస్తూ, “ఈ ఫొటో చూసిన వెంటనే ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ప్రతి సారి శాన్ హోసే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈసారి కూడా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పాటలను సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఈ సంగీత వేడుకను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

బాటా మాజీ అధ్యక్షుడు వీరు ఉప్పాల మాట్లాడుతూ, “దేవిశ్రీ ప్రసాద్ అమెరికా పర్యటనల్లో ప్రతి సారి బాటాకు కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 2008లో ప్రారంభమైన ఈ ప్రయాణం తర్వాత 2014, 2018, 2023లో కూడా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించే అద్భుతమైన సంగీత వేడుకకు సిద్ధమవుతున్నాం” అని తెలిపారు.

ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన టికెట్లకు భారీ స్పందన లభించిందని, ఎక్కువ శాతం టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈసారి కూడా కార్యక్రమం హౌస్‌ఫుల్‌గా జరిగి, బే ఏరియా తెలుగు ప్రేక్షకులకు మరపురాని సంగీతానుభూతిని అందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

బాటా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక సంగీత విభావరి, దేవిశ్రీ ప్రసాద్ అభిమానులతో పాటు బే ఏరియా తెలుగు కమ్యూనిటీకి మరో మధురమైన జ్ఞాపకంగా నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry