సౌదీలో హైదరాబాదీ రోగిని ఆదుకున్న మలయాళీ!

NRI News UAE

ఒక్క మాట కూడా పలుకలేని దీనావస్థలో మంచంపై కన్నీరుమున్నీరవుతున్న ఓ హైదరాబాదీని సౌదీలోని ఒక మలయాళీ ఆదుకున్నారు.

సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు పక్షవాతంతో గత సంవత్సర కాలంగా మంచాన ఉన్న హైదరాబాద్ వాస్తవ్యుడు మొహమ్మద్ అబ్దుల్ అలీంను (55) అందరూ మరిచిపోయారు. కానీ మలయాళీలు మాత్రం తామున్నామంటూ ఆదుకున్నారు. మంచంలో ఉన్న ఆయనకు సేవ చేయడంతో పాటు బ్యాంకు అప్పులు తీర్చి, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించారు. చివరకు ఆయనను హైదరాబాద్‌కు పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు.

15 ఏళ్ళుగా సౌదీ అరేబియాలో సేల్స్‌మాన్‌గా పని చేస్తూ హాయిగా గడిపిన అబ్దుల్ అలీం హైదరాబాద్‌లో తన భార్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన భారత్‌కు వచ్చారు. తాను హైదరాబాద్‌కు వెళ్లక ముందు ఒక కారును అలీం వాయిదాలపై కొనుగోలు చేశారు. ఆరోగ్యం క్షిణించి భార్య మరణించడంతో కుటుంబ సమస్యల కారణంగా ఆయన సకాలంలో సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లలేకపోయారు. కొవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిని పరిస్థితులు కూడా ఆయనకు అవరోధంగా మారాయి.

ఆ తర్వాత నూతన వీసాపై అనేక ఆశలతో సౌదీ అరేబియాలో అడుగుపెట్టిన అలీంకు దురదృష్టం వల్ల అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. మునుపటి ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు గతంలో ఆయన కొనుగోలు చేసిన కారుకు బకాయిలు చెల్లించకపోవడంతో కేసు నమోదైంది. ఆయన ప్రయాణాలపై నిషేధం నమోదయింది.

సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేయడంతో హైపర్ టెన్షన్, ఆ తరువాత పక్షవాతానికి గురైన అలీంను ఆసుపత్రిలో చేర్పించి కొన్ని నెలల పాటు చికిత్స అందించారు. తనను ఆదుకోవల్సిందిగా ఆయన అందరు హైదరాబాదీలను కోరినా… పెద్ద మొత్తం బకాయి కావడంతో ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఆసుపత్రిలో ఆయనను తెలంగాణ ఎన్నారై సంఘానికి చెందిన మొహమ్మద్ లాయిఖ్ సందర్శించారు. అయితే, భారీ మొత్తం బాకీ పడ్డ కారణాంగా నిస్సహాయంగా వెనక్కి వచ్చారు. ఆ తరువాత ఏ ఒక్క హైదరాబాదీ కనీసం అలీం ఆరోగ్యస్థితి గురించి కూడా వాకబు చేయలేదు.

అలీం దీనస్థితిని తెలుసుకున్న మలయాళీలు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆనంతరం వక్ఫ్ ఆధ్వర్యంలోని ఒక శరణాలయానికి ఆయనను తరలించి సేవలందించారు. 8 నెలల పాటు శరణాలయంలో కేరళకు చెందిన షామీర్ నద్వీ అనే సామాజిక సేవకుడు అలీం ఆలనాపాలనా చూశారు.

హైదరాబాదీ రోగి దీనావస్థ గురించి షామిర్ ఇతర మలయాళీల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం గల్ఫ్‌లోని భారతీయ సంపన్నులలో ఒకరైన లూలూ గ్రూప్ యాజమాని యం.ఎ.యూసుఫ్ అలీ దృష్టికి రావడంతో ఆయన వెంటనే అలీం బకాయిలను చెల్లించి ఆయనకు న్యాయస్థానంలో ఉన్న కేసుల నుంచి విముక్తి కల్గించారు.

తన కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులకు అలీం కేసును వీలైనంత త్వరగా పరిష్కరించి హైదరాబాద్‌కు పంపించవల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ప్రతినిధులు అలీంను వీల్ చెయిర్‌పై మలయాళీ అయిన షామీర్‌ను వెంట ఇచ్చి సాగనంపగా అలీం బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాటలు సరిగ్గా పలకలేని అలీం … చేతులెత్తి యూసుఫ్ అలీకి, ఇతర మలయాళీలకు కృతజ్ఞతగా దండం పెట్టారు.

హైదరాబాదీలు బిర్యానీలు, బడాయి మాటలు, సామాజిక మాధ్యమాలలో పోస్టులలో నిమగ్నమై ఉండగా మలయాళీలు మౌనంగా మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించుకున్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *