ఏనుగు తాత – అసామాన్యుడు:

Telugu Personalities

అక్షరాల సాక్షిగా ఒక నిరాడంబర కవి

పదవులు, హోదాలు మనిషికి తాత్కాలికం. కానీ ఆ పదవుల్లో ఉన్నప్పుడు వారు చూపే నిరాడంబరత, వారి వ్యక్తిత్వం, వారు సృష్టించిన అక్షర సంపద మాత్రమే సమాజంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నేటి కాలంలో చిన్న పదవి రాగానే ఆకాశానికెగిరిపోయే వాళ్లు, పది మంది సేవకులు తమ చుట్టూ ఉండాలని కోరుకునే వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ, అధికార పీఠం మీద ఉన్నప్పటికీ గర్వం దరిచేరని ఒక అచ్చమైన మట్టి మనిషి, అక్షర తపస్వి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా, ఒక ఉన్నత ఐఏఎస్ అధికారిగా, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శిగా ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే. అయితే, ఒక పాలనాధికారిగా కంటే.. అచ్చమైన తెలంగాణ కవిగా ఆయన అక్షర ప్రయాణం అత్యంత లోతైనది. తెలంగాణ మట్టి వాసనను, పల్లె బతుకు చిత్రాన్ని, సామాన్యుల కష్టసుఖాలను తన కవిత్వంలోకి ఒంపుకున్న దార్శనికుడు ఆయన. ఆయన రాసిన ప్రతి కవితా పంక్తిలో తెలంగాణ గ్రామీణ జీవనం, ఇక్కడి నుడికారం, మానవ సంబంధాల మాధుర్యం తొణికిసలాడుతుంటాయి. దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్య రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని, ఆధునిక కవిత్వానికి కొత్త సొగసులు అద్దిన ఆయన ఎందరో యువ కవులకు మార్గదర్శిగా నిలిచారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి సాహిత్యాన్ని, చరిత్రను గ్రంథస్థం చేయడంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఆయన పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది. మట్టిలో మాణిక్యాల్లాంటి ఎందరో అజ్ఞాత కవుల చరిత్రను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడంలో, ప్రతిష్టాత్మక ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన అహర్నిశలు శ్రమించారు. పాలకుడి కుర్చీలో ఉన్నా, ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ అక్షరాల చుట్టూ, ఆ అక్షరాలను నమ్ముకున్న సామాన్య రచయితల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే ఏనుగు నరసింహారెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ కవులు, కళాకారుల సందడి కనిపిస్తుంది.

అలాంటి ఒక ఉన్నత స్థాయి అధికారి, ఒక సుప్రసిద్ధ కవి ఇంట్లోకి రాగానే ఆ అధికార, సాహిత్య దర్పాలను గుమ్మం బయటే వదిలేసి, తన చిన్నారి మనవరాలితో గడుపుతున్న మధురమైన దృశ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. ఆ దృశ్యంలో ఆయన తన బ్యాగ్ చిరిగిపోతే దానిని పక్కన పారేయకుండా, లేదా పని వాళ్లకు ఇచ్చి కుట్టించుకోకుండా స్వయంగా సూది దారం పట్టి కుట్టుకుంటున్నారు. ఒడిలో మనవరాలు ఆడుకుంటుంటే, ఆమెతో ఆప్యాయంగా ముచ్చటిస్తూనే ఎంతో ఓపికగా తన పని తాను చేసుకుంటున్నారు.

ఎన్నో ఫైళ్లపై సంతకాలు చేసే చేతులు, ఎన్నో అద్భుతమైన కవితలు రాసిన చేతులు.. ఒక చిన్న బ్యాగ్‌ను కుడుతున్న తీరు ఆయనలోని నిరాడంబరతను, క్రమశిక్షణను చాటిచెబుతోంది. కవిత్వంలో సామాన్యుల జీవితాలను ఎంత ఆర్ద్రంగా చిత్రీకరిస్తారో, నిజ జీవితంలోనూ ఆయన అంతే సాధారణంగా జీవిస్తారని ఈ ఒక్క సంఘటన నిరూపించింది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం చాలా కొద్దిమందికే సొంతం. ఆ కొద్దిమందిలో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆడంబరాలకు ఆమడదూరంగా ఉంటూ, మనవరాలికి కథలు చెప్పే ఒక ఆప్యాయమైన తాతగా, తన పనులు తాను చేసుకునే ఒక సగటు మనిషిగా ఆయన జీవనశైలి నేటి తరానికి ఒక గొప్ప పాఠం. ‘ఏనుగు తాత ఐ లవ్ యు’ అని ముద్దు ముద్దుగా మనుమరాలు అంటుంటే ఆ ఆనందమే వేరు. అక్షరాల సాక్షిగా, నిరాడంబరతకు సాక్షిగా ఆయన అందరిలో ఒక సామాన్యుడు… కానీ అసామాన్యుడు!

  • పురుషోత్తం నారగౌని

What do you feel about this post?

66%
like

Like

31%
love

Love

3%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *