కాకినాడ నుంచి అమెరికా దాకా… అక్షర హాస్య ప్రస్థానం!
వీడియో ఆత్మకథ రూపంలో అమెరికా హాస్యబ్రహ్మ ‘వంగూరి చిట్టెన్ రాజు’ జీవిత విశేషాలు; కాకినాడ నుంచి ఐఐటీకి, అక్కడి నుంచి అమెరికాకు సాగిన ఆసక్తికర ప్రయాణం!
పుస్తక రూపంలో ఆత్మకథలు రాసుకోవడం పరిపాటే. కానీ, దశాబ్దాల తన జీవితానుభవాలను, అమెరికాలో తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని భావితరాలకు అందించేందుకు ప్రముఖ రచయిత, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు వినూత్నంగా ‘వీడియో ఆత్మకథ’కు శ్రీకారం చుట్టారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, కాకినాడ నుంచి బొంబాయికి, అక్కడి నుంచి అమెరికాకు సాగిన ఆయన ప్రయాణం ఎన్నో ఆసక్తికరమైన మలుపులకు, దైవ ఘటనలకు సజీవ సాక్ష్యం.
రూ. 500 లతో ఐఐటీ బొంబాయికి..
కాకినాడలో పుట్టి పెరిగిన చిట్టెన్ రాజు గారు అక్కడే ఇంజనీరింగ్ (మెకానికల్, 1966) పూర్తి చేశారు. ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫ్యాక్టరీలు లేకపోవడంతో ఉద్యోగాలకంటే మాస్టర్స్ చేయడం మేలని భావించారు. దేశవ్యాప్తంగా 30-40 కాలేజీలకు దరఖాస్తు చేయగా, అనూహ్యంగా ‘ఐఐటీ బొంబాయి’ నుంచి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. మిత్రుడు గోవిందరాజుతో కలిసి కేవలం ఐదు వందల రూపాయల బడ్జెట్‌తో కాకినాడ నుంచి బొంబాయికి రైలెక్కారు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఐఐటీ బొంబాయికి వెళ్లిన తొలి విద్యార్థిగా ఆయన చరిత్ర సృష్టించారు.
మ్యాప్ మీద గుండుసూది… ఆరేళ్ల తర్వాత అమెరికా ప్రయాణం!
ఆయన అమెరికా ప్రయాణం ఒక అద్భుతమైన దైవఘటన. 1968లో ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో, ఒక మిత్రుడు అమెరికాకు దరఖాస్తు చేస్తూ తోడు కోసం చిట్టెన్ రాజు గారితో కూడా అప్లై చేయించాడు. అమెరికా మ్యాప్ మీద కళ్లుమూసుకుని గుండుసూదితో గుచ్చి, తగిలిన ‘శాన్ ఆంటోనియో (టెక్సాస్)’ అడ్రస్‌ను అప్లికేషన్‌లో రాశారు. కొద్ది నెలలకు అమెరికా నుంచి ఒక కవర్ వస్తే, దాన్ని చదవకుండా పెట్టె అడుగున పడేశారు. ఆరేళ్ల తర్వాత, 1974లో పీహెచ్‌డీ పూర్తయ్యాక పాత వస్తువులు తీస్తుంటే ఆ కవర్ బయటపడింది. అది తీసుకుని యూఎస్ కాన్సులేట్‌కు వెళితే… “ఇది గ్రీన్ కార్డ్ అప్రూవల్ లెటర్, నువ్వు రేపే అమెరికా వెళ్లిపోవచ్చు” అని అధికారులు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అలా 1974 డిసెంబర్ 30న అమెరికా గడ్డపై అడుగుపెట్టారు.
బొంబాయిలో రగిలిన మాతృభాషాభిమానం..
కాకినాడలో కళలు, సాహిత్యం మధ్యే పెరిగినా అదంతా కేవలం చూసి ఆనందించడానికే పరిమితమైంది. కానీ, ఐఐటీ బొంబాయిలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు తమ తమ మాతృభాషల పట్ల, సంస్కృతి పట్ల చూపిస్తున్న అభిమానం చిట్టెన్ రాజు గారిలో కనువిప్పు కలిగించింది. క్యాంపస్ లో ఉన్న కొద్దిపాటి తెలుగువారందరినీ (ప్రముఖ గాయని పి. సుశీల గారి సోదరుడు రామకృష్ణారావు తదితరులు) కలుపుకుని తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బొంబాయిలోని షణ్ముఖానంద హాల్‌లో దిగ్గజాల కచేరీలు వినడం, ఏకంగా ఐఐటీ క్యాంపస్‌లోనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో అర్ధరాత్రి వేళ 5 గంటల పాటు కచేరీ ఏర్పాటు చేయడం వారి కళాభిరుచికి నిదర్శనం.
నాటకాల కోసమే కలం పట్టి… ‘హాస్య బ్రహ్మ’గా ఎదిగి..
క్యాంపస్‌లో ప్రదర్శించడానికి తెలుగు నాటకాల స్క్రిప్టులు దొరక్కపోవడంతో, మిత్రుల ప్రోద్బలంతో 1968లో మొట్టమొదటిసారిగా “బామ్మాయణం” అనే నాటకం రాశారు. ఆ తర్వాత అది ఒక వ్యసనంగా మారి సుమారు 30 కి పైగా నాటకాలు రచించారు. ఆధునిక దుర్యోధనుడు, ఆస్ట్రోనాట్ ఆరుముగం, పోలీస్ వెంకటస్వామి వంటి మోనో యాక్షన్స్ (ఏకపాత్రాభినయం) చేస్తూ, సుమారు 20 ఏళ్ల పాటు ‘హాస్య పంచాంగ శ్రవణం’ వినిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఎవరినీ కించపరచకుండా, వ్యక్తిత్వం మీద ఆరోగ్యకరమైన వ్యంగ్యాన్ని ప్రయోగిస్తూ ఆయన చేసిన రచనలే ఆయనకు ‘అమెరికా హాస్య బ్రహ్మ’ అనే బిరుదును తెచ్చిపెట్టాయి.
అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని బతికించడంలో, భావితరాలకు అందించడంలో వంగూరి చిట్టెన్ రాజు గారి కృషి అనిర్వచనీయమైనది. ఆయన జీవిత విశేషాలు కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఖండాంతరాల్లో తెలుగు భాష వికసించిన వైనం!
– పురుషోత్తం నారగౌని, మొబైల్ : 897388393
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
