అక్షరాలతో పేర్చిన ఆత్మగౌరవ బోనం… ఒక సజీవ కవికి ఆత్మీయ నీరాజనం!

సాహిత్యం

(నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన)

సాహిత్యం సమాజాన్ని నేరుగా మార్చకపోవచ్చు కానీ, సమాజాన్ని మార్చే వ్యక్తులను తయారుచేస్తుంది. అలాంటి చారిత్రక బాధ్యతను తన భుజాలపై వేసుకొని, దశాబ్దాలుగా అక్షర సేద్యం చేస్తున్న నిబద్ధత గల కలం యోధుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు అయిన ఆయన సాహిత్య ప్రస్థానంపై వెలువడిన “డాక్టర్ నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన” బృహత్తర గ్రంథావిష్కరణ సభ… ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.

సారస్వత పరిషత్ వేదికగా డాక్టర్ వి. జయప్రకాష్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక పుస్తక విడుదల లాగా కాకుండా, ఒక జీవన సాఫల్య వేడుకలా, తెలంగాణ ఆత్మగౌరవ పతాకలా సాగింది.

804 పేజీలు… 117 వ్యాసాలు: వక్తల దృష్టిలో ‘సాహిత్య సమాలోచన’

ఒక సజీవ కవిపై (Living Legend) 117 మంది పరిశోధకులు, విమర్శకులు వ్యాసాలు రాసి 804 పేజీల గ్రంథంగా తీసుకురావడం తెలుగు సాహిత్య చరిత్రలోనే ప్రథమం. సభలో ప్రముఖుల ప్రసంగాల ఆధారంగా ఈ గ్రంథంలోని లోతులను పరిశీలిస్తే…

తెలంగాణ అక్షర బోనం: పద్య సారస్వత పీఠం కవి అవసరాల భాను ప్రకాష్ ఈ గ్రంథాన్ని అద్దంలో కొండను చూపించినట్లుగా సభికులకు పరిచయం చేశారు. “ఈ పుస్తకం సిధారెడ్డి గారు తెలంగాణ తల్లికి అర్పించిన అక్షరాల బోనం. ఆ బోనానికి 117 మంది వ్యాసకర్తలు తమ వ్యాసాలతో అల్లిన దారాలే ఈ గ్రంథం” అని వర్ణించారు. సిధారెడ్డి గారి 8 కవితా సంపుటాలు, 5 విమర్శ గ్రంథాలు, 1 పాటల సంకలనం, 2 కథల సంపుటాలపై ఈ వ్యాసాలు వచ్చాయి.

దోసెడు తెలంగాణ మట్టి: తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం పుస్తకంలోని గణాంకాలను అద్భుతంగా విశ్లేషించారు. “ఈ పుస్తకం చూస్తుంటే దోసెడు తెలంగాణ మట్టిని కళ్ళకు అద్దినట్లుంది” అన్న ఆయన… కవిత్వంపై 30, ‘నాగేటి చాల్లల్ల’ పై 9, కేవలం రెండు కథా సంపుటాలపై ఏకంగా 21 వ్యాసాలు రావడం విశేషమన్నారు. అలాగే నృత్యరూపకాలపై 8, భాషపై 3, ‘ఇగురం’పై 4 వ్యాసాలు ఇందులో ఉన్నాయి.

మహిళా విమర్శకుల రికార్డు: తెలంగాణలో కవయిత్రులు లేరన్న అపోహలను పటాపంచలు చేస్తూ, ఈ బృహత్తర గ్రంథంలో ఏకంగా 48 మంది స్త్రీలు (47 మంది విమర్శకులుగా) భాగస్వామ్యం కావడం ఒక చారిత్రక రికార్డు అని శంకరం గారు గర్వంగా చెప్పారు. మొదటి వ్యాసం అఖిలతో మొదలై, చివరి వ్యాసం మహేశ్వరితో ముగియడం దీని ప్రత్యేకత.

విమర్శకుల కోణాలు: నది పుట్టువడి పై వ్యాసం రాసిన ఎడ్ల కల్లేష్… కాళోజీ కవిత్వం ఒక రేఖ అయితే, సిధారెడ్డి కవిత్వం సమకాలీన రేఖ అని పోల్చారు. ‘అనిమేష’ పై కొత్త అరుణ అనుభూతివాదాన్ని చర్చిస్తే, కవితల్లో స్త్రీ పాత్రల చిత్రణపై భమిడిపాటి గౌరీశంకర్ అద్భుతమైన విశ్లేషణ చేశారు. మంజీరా రచయితల సంఘం గురించి కే. నవీన్ కుమార్ రాస్తూ “మరసం చరిత్ర అంటే సిధారెడ్డి చరిత్రే” అని తేల్చిచెప్పారు.

గ్లోబల్ పర్స్పెక్టివ్ (ఆంగ్ల వ్యాసాలు): ఈ గ్రంథంలో 110 తెలుగు వ్యాసాలతో పాటు 7 ఆంగ్ల వ్యాసాలు ఉండటం అంతర్జాతీయ స్థాయికి నిదర్శనం. ఉస్మానియా ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ రాసిన ‘రీజనల్ ఐడెంటిటీ – పోస్ట్ కలోనియల్ కాన్షస్ నెస్ అండ్ అండర్ స్టాండింగ్’ పరిశోధనా పత్రం సిధారెడ్డి సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్య సైద్ధాంతిక చట్రంలో  నిలబెట్టింది.

రాజీపడని ఆత్మాభిమానం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. “2001లో తెలంగాణలో రైతులు కరువు కాటకాలతో అల్లాడుతున్న విపత్కర పరిస్థితులలో, ఆనాటి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తన కవిత్వానికి ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ పురస్కారాన్ని అత్యంత సున్నితంగా, నిక్కచ్చిగా తిరస్కరించిన గట్స్  ఉన్న కవి సిధారెడ్డి గారు. రాజీపడని ఆత్మాభిమానానికి ఆయన ఒక అభినవ పోతన” అని ఆయన ప్రశంసించారు. ఇంతటి గాఢత ఉన్న సాహిత్యాన్ని ఎల్లలు దాటించి విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

విశ్వజనీన దృక్పథం – విమర్శకుల విశ్లేషణలు
సైద్ధాంతిక పునాది: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సిధారెడ్డి గారి రచనల వెనుక ఉన్న మార్క్సిస్టు పునాదిని విడమర్చి చెప్పారు. ‘చిత్రకన్ను’ కథను ప్రస్తావిస్తూ, అగ్రవర్ణాలకు, అణగారిన వర్గాలకు మధ్య ఉన్న నిరంతర సంఘర్షణను ఆయన ఎంత ఆర్ద్రంగా చిత్రించారో వివరించారు.

ప్రపంచ కవులతో పోలిక: ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ… కెన్యా రచయిత ‘గుగీ వా థియాంగో’, నైజీరియా రచయిత ‘చినువా అచెబే’ లు వలసవాదానికి వ్యతిరేకంగా తమ మాతృభాషలో ఎటువంటి రచనలు చేశారో, సిధారెడ్డి గారు తెలంగాణ మాండలికంలో అదే స్థాయి ఆధిపత్య వ్యతిరేక రచనలు చేశారని పోల్చారు.

ప్రజాకవి: సిటీ కళాశాల ఆచార్యులు కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ, నాగేటి సాలల్లోని రైతు, నాట్లు వేసే తల్లి, బీడీలు చేసే చెల్లి సిధారెడ్డి కవిత్వంలో ప్రధాన వస్తువులని కీర్తించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మూడు తరాల వారు ఆయన సాహిత్యాన్ని నేడు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.

అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్. బాలాచారి సభనుద్దేశించి ప్రసంగించగా, డాక్టర్ మన్యమోని కృష్ణయ్య సంస్కృత శ్లోకాలతో, సోమశల తిరుపాల్ తన అద్భుతమైన గానంతో సభను అలరించారు.

మనిషి మారలేదు… మమత తీరలేదు
ఒక కవి గొప్పదనం అతని అక్షరాల్లోనే కాదు, నడవడికలో ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మృణాళిని మాట్లాడుతూ, 1976లో ఉస్మానియా పాత క్యాంటీన్‌లో తాను కొనిచ్చిన 3/5 ఛాయితో మొదలైన తమ స్నేహం నేటికీ అలాగే ఉందన్నారు. “మనిషి మారలేదు, అతని మమత తీరలేదు అనే పాటకు నిలువెత్తు రూపం సిద్ధారెడ్డి. ఎన్నో అవార్డులు, హోదాలు వచ్చినా అతనిలోని నిష్కళంకత్వం, వినయం ఏమాత్రం తగ్గలేదు” అని ఆమె ఉద్వేగంగా పంచుకున్నారు. 1974లో సిద్దిపేటలో ఇద్దరూ కలిసి తెచ్చిన ‘దివిటీ’ పుస్తక జ్ఞాపకాలను తెరసం జంటనగరాల అధ్యక్షులు డాక్టర్ కందుకూరి శ్రీరాములు సభ ముందుంచారు.

“నా భుజాలు మాత్రమే గొప్పవి కావు… ఆ బరువు వెనుక మీరందరూ ఉన్నారు!”
సత్కారాలు, ప్రశంసల వర్షం అనంతరం డాక్టర్ నందిని సిధారెడ్డి ఎంతో వినమ్రంగా స్పందించారు. తన ప్రసంగంలో ఆద్యంతం ఆయన సహృదయత, హాస్యచతురత తొణికిసలాడాయి.

వనపర్తి సోనా మసూరి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో తనకున్న చనువును పంచుకుంటూ… “వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చూస్తే, భవిష్యత్తులో ‘బాపట్ల సోనా మసూరి’కి బదులు ‘వనపర్తి సోనా మసూరి’ అని పిలవాలేమో” అని చమత్కరించినప్పుడు సభలో నవ్వులు పూశాయి. ఈ బృహత్తర గ్రంథ ముద్రణకు ఆర్థికంగా అండగా నిలిచిన నిరంజన్ రెడ్డి గారి ఉదారతను ఆయన స్మరించుకున్నారు.

అక్షర సైనికులకు కృతజ్ఞతలు: ఈ సదస్సు నిర్వహణ కోసం అవసరమైతే ఒక నెల జీతం సొంతంగా వెచ్చించడానికైనా సిద్ధపడిన డాక్టర్ శ్రీభాష్యం అనురాధ నిబద్ధతను, అహర్నిశలు శ్రమించిన డాక్టర్ వి. జయప్రకాష్, పి. బడేసాబ్, డాక్టర్ లక్ష్మీ అసిరెడ్డి, ఎడ్ల కల్లేష్, జగన్ లకుమల్ల తదితరుల కృషిని కొనియాడారు. తన కవితా పాదాలతో ఎడ్ల కల్లేష్, జయప్రకాష్ లు రూపొందించిన టేబుల్ క్యాలెండర్‌ను చూసి ఆనందంతో ఆ రాత్రి నిద్ర కూడా పోలేదని ఆయన ఆత్మీయంగా చెప్పారు.

వడ్ల వజ్రక్క ప్రేమ… తెలంగాణ రక్తం: “నా పుట్టినూరు బందారంలో హలం పట్టాల్సిన చేత్తో కలం ఎందుకు పట్టానో నాకు తెలియదు. కానీ కాలం నాపై మోపిన బరువులన్నీ హాయిగా మోశాను. ఆ బరువు నేను మోయగలిగానంటే నా భుజాలు మాత్రమే గొప్పవి కావు… ఆ బరువు వెనుక మీ అందరి చైతన్యం ఉంది” అని సిధారెడ్డి గారు ఉద్వేగానికి లోనయ్యారు. “చిన్నప్పుడు మా అమ్మ పొలానికి వెళితే పక్కింటి ‘వడ్ల వజ్రక్క’ నాకు పాలు తాపి పెంచింది. నా రక్తంలో ఉన్నది నా రక్తం మాత్రమే కాదు… ఈ తెలంగాణ ప్రజల రక్తం. అందుకే ‘అనిమేష’కు కేంద్ర పురస్కారం వచ్చినప్పుడు దాన్ని తెలంగాణ సంస్కృతికి అంకితం చేశాను. నా జీవితాంతం మీకోసం రాస్తూనే ఉంటాను” అంటూ ఆయన ముగించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆర్ద్రంగా తాకింది.

ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ మృణాళిని, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కోయి కోటేశ్వరరావు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, డాక్టర్ మన్యమోని కృష్ణయ్య, డాక్టర్ వి. జయప్రకాష్, పి. బడేసాబ్, డాక్టర్ శ్రీభాష్యం అనురాధ, అవసరాల భాను ప్రకాష్, సోమశల తిరుపాల్, డాక్టర్ లక్ష్మీ అసిరెడ్డి, డాక్టర్ ఎడ్ల కల్లేష్, ఏలూరి రఘుబాబు, గాజర్ల రమేష్, జగన్ లకుమల్ల, దాసోజు పద్మావతి, రాధిక, కే. సత్యనారాయణ, జగ్గయ్య తదితరులు ప్రసంగించారు.

ఒక మనిషి నిబద్ధతగా బతికితే, తన మట్టిని, భాషను ప్రేమిస్తే, ఆ సమాజం అతన్ని ఎంతలా అక్కున చేర్చుకుంటుందో చెప్పడానికి ఈ ‘సాహిత్య సమాలోచన’ సభే సజీవ సాక్ష్యం. భవిష్యత్ తరాలకు ఈ గ్రంథం ఒక గొప్ప కరదీపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ కార్యక్రమం తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలోజరిగింది.

– పురుషోత్తం నారగౌని

What do you feel about this post?

100%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *