ఈ20తో వాహన ఇంజిన్లకు భారీ ముప్పు.. సియామ్ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం

Business News

దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ20 (E20 Petrol) ఇంధనాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ20 పెట్రోల్ నాణ్యతపై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇంధనంలో క్లోరైడ్ కాలుష్యం, తేమ శాతం విపరీతంగా ఉండటం వల్ల వాహనాల ఇంజిన్లలోని కీలక విడిభాగాలు వేగంగా దెబ్బతింటున్నాయని ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్’ (సియామ్) కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు రాసిన ఒక లేఖలో ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఈజీఆర్ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు వంటి అత్యంత కీలకమైన ఇంజిన్ భాగాలు ఈ కలుషిత ఇంధనం కారణంగా శాశ్వతంగా పాడైపోతున్నాయని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాల నుంచి నేరుగా సేకరించిన ఇంధన నమూనాల్లో (E20 Petrol) క్లోరైడ్ స్థాయులు ఏకంగా 500 ఎంజీ/కేజీ వరకు ఉండగా, రిటైల్ అవుట్‌లెట్లలో (పెట్రోల్ బంకుల్లో) 350 ఎంజీ/కేజీ వరకు రికార్డయ్యాయని సియామ్ తన లేఖలో కేంద్రానికి సోదాహరణంగా వివరించింది. E20 Petrol,

వాహనాల భద్రత, ఇంజిన్ల మన్నికను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ ఈ20, ఈ85 ఇంధనాల్లో మొత్తం క్లోరైడ్ పరిమితిని 1 ఎంజీ/కేజీ కంటే తక్కువగా ఉండేలా తక్షణమే కఠిన నిబంధనలు తీసుకురావాలని సియామ్ కేంద్రాన్ని కోరింది. అలాగే ఇంధనంలో కలిపే ఇథనాల్‌కు కూడా అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించాలని విజ్ఞప్తి చేసింది. గత రెండేళ్లుగా ఈ తీవ్రమైన అంశాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కమిటీ దృష్టికి పదేపదే తీసుకెళ్తున్నప్పటికీ, ఇంధన నాణ్యత పరీక్షల జాబితాలో క్లోరైడ్‌ను తప్పనిసరి పరీక్షగా చేర్చే నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటం పట్ల పరిశ్రమ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా నాణ్యతా ప్రమాణాలు లోపించిన పెట్రోల్ (E20 Petrol) వాడటం వల్ల సామాన్య వినియోగదారులపై రిపేర్ల రూపంలో భారీ ఆర్థిక భారం పడుతుందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్షణమే చమురు పంపిణీ సంస్థలు (ఓఎంసీలు) నాణ్యత నియంత్రణలను కఠినతరం చేయాలని సియామ్ సూచించింది.

క్లోరైడ్ కాలుష్యంతో పాటు ఈ20 పెట్రోల్‌లో అధిక తేమ శాతం కూడా వాహనాలకు మరో ప్రధాన సమస్యగా మారిందని సియామ్ లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఇంధనంలో అనుమతించిన తేమ పరిమితి కేవలం 3,000 ఎంజీ/కేజీ మాత్రమే ఉండగా, కొన్ని నమూనాల్లో అది ఏకంగా 10,000 ఎంజీ/కేజీ దాటిపోయిందని సియామ్ వెల్లడించింది. ఈ స్థాయిలో తేమ ఉండటం వల్ల ఇంధనంలో ‘ఫేజ్ సెపరేషన్’ (నీరు, పెట్రోల్ విడిపోవడం) ఏర్పడి, బంకులో వాహనానికి ఇంధనం నింపిన వెంటనే మధ్యలోనే ఇంజిన్ ఆగిపోయే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని తీవ్రంగా హెచ్చరించింది. ముఖ్యంగా పాత రిటైల్ అవుట్‌లెట్లలో ఉన్న భూగర్భ నిల్వ ట్యాంకులు (అండర్ గ్రౌండ్ ట్యాంక్స్), పైప్‌లైన్‌ల నిర్వహణలో ఉన్న లోపాలు కూడా ఈ స్థాయి కాలుష్యానికి ఒక ప్రధాన కారణమని పేర్కొంది. దీనిని అరికట్టేందుకు ఓఎంసీలు తరచూ కఠినమైన ఆడిట్‌లు చేపట్టాలని సూచించింది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *