చూపునిచ్చే సంకల్పం: డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ ‘5K వాక్’ దిగ్విజయం

NRI News United States

చూపునిచ్చే సంకల్పం: డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ ‘5K వాక్’ దిగ్విజయం

అమెరికాలో ఘనంగా వార్షిక నడక.. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవాస భారతీయుల కదనోత్సాహం

డెట్రాయిట్/మిచిగన్ (ప్రత్యేక ప్రతినిధి):

కంటిచూపు సమస్యలతో అంధకారంలో మగ్గుతున్న పేద, బడుగు వర్గాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా యజ్ఞానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు ఘన నీరాజనం పలికారు. మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ‘5K వాక్’ కార్యక్రమం అపూర్వ ప్రజాదరణతో అత్యంత వైభవంగా, దిగ్విజయంగా ముగిసింది. కంటి ఆరోగ్యం, నివారించదగిన అంధత్వంపై సమాజంలో విస్తృత అవగాహన పెంచడంతో పాటు, నిరుపేదలకు ఉచిత నాణ్యమైన నేత్ర చికిత్సలు అందించేందుకు నిధులు సమకూర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ నడక సాగింది.

ఉత్సాహంగా సాగిన నడక.. వెల్లివిరిసిన సేవా స్ఫూర్తి:

చిన్నారులు, మహిళలు, యువత, వృద్ధులు సహా స్థానిక భారతీయ-అమెరికన్ కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా అడుగులు వేశారు. కేవలం ఆరోగ్య స్పృహ కోసమే కాకుండా, శంకర నేత్రాలయ సామాజిక బాధ్యతాయుత లక్ష్యాలకు అండగా నిలిచేందుకు తామంతా ఒక్కటేనంటూ చాటిచెప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ నడకలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ఉదార సహకారం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రేరణగా నిలిచాయి. 5K వాక్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్ అందజేయడంతో పాటు, విజయవంతానికి తోడ్పడిన వాలంటీర్లు, స్పాన్సర్లను నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కీలక పాత్ర పోషించిన కార్యవర్గం & వాలంటీర్ల బృందం:

డెట్రాయిట్ చాప్టర్ నాయకత్వ బృందం చూపిన సమన్వయం, పకడ్బందీ ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, విజయ్ పెరుమాళ్ళ, రవి కవుతరపు, వెంకట్ గోటూర్, త్రిపుర సుందరి భాగవతుల నిరంతర కృషిని సభ కొనియాడింది. అలాగే క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లు సాయి గోపిసెట్టి, శిరీషా ఉప్పలపాటి, రజని బేతిన, అనిత బొమ్మనవేని సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బాల రెడ్డి ఇందుర్తి గారు మరియు నాయకత్వ బృందం అందించిన దూరదృష్టి, అమూల్యమైన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం వల్లే ఇంతటి భారీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగామని డెట్రాయిట్ చాప్టర్ ప్రతినిధులు కొనియాడారు.

ప్రతి చిన్న సాయం.. ఒకరి జీవితంలో మహోన్నత వెలుగు:

శంకర నేత్రాలయ భారతదేశంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆధునిక సంచార నేత్ర వైద్యశాలలు (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు), ఉచిత కంటి ఆపరేషన్ల ద్వారా లక్షలాది మందికి దృష్టి ప్రసాదిస్తున్న వైనాన్ని నిర్వాహకులు వివరించారు. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం కావడం, స్పాన్సర్ చేయడం, విరాళాలు ఇవ్వడం లేదా వాలంటీర్‌గా సమయాన్ని కేటాయించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఒక అంధుడికి చూపునిచ్చి వారి భవిష్యత్తుకు భరోసానివ్వవచ్చని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ, స్పాన్సర్లకు, శ్రేయోభిలాషులకు డెట్రాయిట్ చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

  • పురుషోత్తం నారగౌని (8897388393)

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *