నిరుపేద విద్యార్థినికి బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ అండ: ₹70 వేల ఆర్థిక సాయం అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నిరుపేద ప్రతిభావంతురాలైన విద్యార్థిని సౌమ్య సిరిమల్లె ఉన్నత విద్యకు బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ ఆర్థిక భరోసా కల్పించింది. ప్రస్తుతం ప్రఖ్యాత BVRIT ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (CSDS) మొదటి సంవత్సరం చదువుతున్న సౌమ్య, ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు ఆటంకం కలగకుండా ఉండాలనే సదుద్దేశంతో ఫౌండేషన్ తరఫున ₹70,000 (డెబ్బై వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఎక్సైజ్ సీఐ శ్రీ సైదులు గౌడ్, తెలంగాణ జర్నలిస్ట్ శ్రీ పురుషోత్తం గౌడ్, శ్రీ కడెం కుమార్ గార్ల ద్వారా సౌమ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న అమెరికాలోని ప్రముఖ ఎన్ఎల్ఎన్ (NLN) ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నాతి శ్రీనివాస్ (USA) గారు వెంటనే స్పందించారు. వారి చొరవతో బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ ఈ సాయాన్ని సమకూర్చింది.
స్థానికంగా ఎక్సైజ్ సీఐ సైదులు గౌడ్, NLN ప్రతినిధి నాతి గణేష్ స్వయంగా విద్యార్థినికి ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని సౌమ్యను అభినందిస్తూ, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి తిరిగి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆమెకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం సీఐ సైదులు గౌడ్ మాట్లాడుతూ “పేదరికం ఏ విద్యార్థి చదువుకూ అడ్డంకి కారాదు. నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంతులైన యువత ఉన్నత చదువులకు దూరం కాకుండా అమెరికాలో ఉంటూ కూడా స్వదేశంలోని బిడ్డలను ఆదుకుంటున్న డాక్టర్ నాతి శ్రీనివాస్ గారికి, బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి సేవా దృక్పథం ఎందరికో ఆదర్శప్రాయం” అని కొనియాడారు. సకాలంలో అండగా నిలిచి తన ఇంజనీరింగ్ కలలను ముందుకు నడిపించిన ఫౌండేషన్ నిర్వాహకులకు, సహకరించిన పెద్దలకు విద్యార్థిని సౌమ్య, ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
