శంకరరత్న పురస్కారం 2025: కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు ఘన సత్కారం
శంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులు
చెన్నై: ప్రతిష్టాత్మకమైన శంకరనేత్రాలయ వారి శంకరరత్న పురస్కారం 2025 గ్రహీతగా ప్రముఖ ప్రవాస భారతీయ దాత శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డిగారిని ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల చెన్నైలోని శంకరనేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా శ్రీ ప్రసాద్ రెడ్డిగారికి, శ్రీమతి శోభరెడ్డి గారికి ఈ శంకరరత్న పురస్కారం ఘనంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖుల ఘన హాజరు
ఈ కార్యక్రమానికి శంకరనేత్రాలయ చైర్మన్ శ్రీ డా. సురేంద్రన్, శంకరనేత్రాలయ ఇండియా అధ్యక్షులు శ్రీ డా. గిరీష్ రావు, శంకరనేత్రాలయ అమెరికా అధ్యక్షులు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి గారితో పాటు, అమెరికా నుండి శ్రీ శ్యామ్ అప్పాలి, ఈ.వి.పి, డల్లాస్ ట్రస్టీ, శ్రీ బుచ్చిరెడ్డి గోలి, మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మరియు చెన్నై నగర ప్రముఖులు, శంకరనేత్రాలయ చెన్నై సిబ్బంది పాత్రికేయ బృందం హాజరయ్యారు.
దిగ్గజాలకు దక్కిన గత శంకరరత్న పురస్కారాలు
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ శంకరరత్న పురస్కారాన్ని గతంలో అందుకున్నవారిలో శ్రీ రతన్ టాటా, మాజీ ఇస్రో చైర్మన్ పద్మవిభూషణ్ డా. జి. మాధవన్ నాయర్, మాజీ ఎల్ అండ్ టి చైర్మన్ పద్మవిభూషణ్ ఏ.ఎం. నాయక్, మాజీ టిసిఎస్ సీఈఓ పద్మభూషణ్ ఎస్. రామదొరై, మాజీ హెచ్డీఎఫ్సీ పద్మవిభూషణ్ దీపక్ పరేఖ్ మరియు తమిళ్ చిత్ర దర్శకులు ఎస్.పి. ముత్తురామన్ ఉన్నారు. గతంలో ఈ అవార్డు తీసుకున్న ప్రవాస భారతీయులలో శ్రీ ఎస్.వి. ఆచార్య మరియు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి కూడా ఉన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీ బాలరెడ్డి ఇందుర్తితో పాటు పూర్వ శంకరరత్న అవార్డు గ్రహీతలైన శ్రీ ఎస్.పి. ముత్తురామన్, ప్రముఖ తమిళ రచయిత శ్రీ వి.వి. రంగనాథన్ హాజరు కావడం మరో విశేషం.
వెంకయ్యనాయుడు గారి ప్రసంగం మరియు అభినందనలు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, తన తమిళనాడుతో, మద్రాస్ శంకరనేత్రాలయతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, శ్రీ కాటంరెడ్డి ప్రసాద రెడ్డిగారు, శోభా రెడ్డిగార్ల సేవలను కొనియాడారు. ప్రతీ ఒక్కరూ వీరి సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని మరింత సహకారం అందించాలని సూచించారు. శంకరరత్న పురస్కారం అందుకున్న వీరిద్దరూ సమాజానికి ఆదర్శప్రాయులని ప్రశంసించారు.
బాలరెడ్డి ఇందుర్తి వెల్లడించిన సేవా విశేషాలు
శంకరనేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షులు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో శంకరనేత్రాలయ అనేక రాష్ట్రాలలో చాప్టర్లు ఓపెన్ చేశామని, తద్వారా వాలంటీర్ల సంఖ్య గణనీయంగా పెరిగి దాతల ద్వారా సంస్థకు మునుపెన్నడూ లేని విధంగా నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. ఇదే సందర్భంలో శ్రీ ప్రసాద్ రెడ్డి గారు శంకరరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులని, శోభారెడ్డి గారు, ప్రసాదరెడ్డి గారు నిస్వార్థంతో ఎన్నో సేవాసంస్థలకు అండగా ఉంటూ తమ లాభాలలో రెండు మిలియన్ డాలర్లను ప్రతీ సంవత్సరం విరాళంగా ఇస్తున్నారని తెలియజేశారు.
మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు
శ్రీ ప్రసాద్ రెడ్డి కుటుంబం ఇప్పటికే తొమ్మిది క్యాంపులు నిర్వహించి, మరెన్నో కాంప్స్ను వచ్చే సంవత్సరం షెడ్యూల్ చేయడం జరిగిందని తెలిపారు. వారు చేసిన ప్రత్యేక ఆర్థిక సహాయంతో అత్యంత ఆధునిక మార్పులతో సరికొత్త చెన్నై మేసు (MESU) బస్సు యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీరు చేసిన సేవలకు ఇటీవల న్యూజెర్సీ రాష్ట్ర సెనెట్ అభినందిస్తూ ప్రత్యేక ప్రొక్లమేషన్ కూడా అందించడం జరిగింది.
లక్ష డాలర్ల అదనపు విరాళం అందజేత
శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి గారు తమ అవార్డు స్వీకార ప్రసంగంలో మాట్లాడుతూ శంకరనేత్రాలయ సంస్థ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వందలాదిమంది సేవాకార్యకర్తలు అహర్నిశలు శ్రమించి ఎంతోమందికి కంటిచూపు తెప్పించడం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయ సంస్థలకు అదనంగా మరో లక్ష డాలర్ల విరాళాన్ని అందజేశారు. దీనితో ఇప్పటివరకు శంకరనేత్రాలయకు ప్రసాద్ రెడ్డిగారు, శోభారెడ్డి గారు 6,25,000 డాలర్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేసి అమెరికాలో అత్యధిక ధనసహాయం చేసిన దంపతులుగా తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
మైసూర్ దత్తపీఠంలో స్వామీజీ ఆశీస్సులు
శంకరరత్న పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్రీ బాలరెడ్డి ఇందుర్తి గారు తదనంతరం డా. గిరీష్ రావు, శ్రీ స్వామినాథన్ చంద్రశేఖర్‌తో కలిసి మైసూర్ లోని శ్రీ దత్తపీఠాన్ని సందర్శించి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయ సంస్థ చేపడుతున్న ఉచిత కంటి సేవాకార్యక్రమాల గురించి వివరించి ఆశీస్సులు అర్థించారు. శంకరరత్న పురస్కారం పొందిన ఈ దంపతుల సేవలందిస్తున్న మంచి కార్యక్రమాలకు స్వామీజీ తమ పూర్తి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు.
