దృష్టి కోసం సంగీత, నృత్య మహోత్సవం: అంధత్వ నివారణకు ప్రవాస భారతీయుల చేయూత
నోవై (మిచిగాన్):
కళను మానవతా దృక్పథంతో జోడించి, అంధత్వ నివారణకు అండగా నిలిచేందుకు ప్రవాస భారతీయ సమాజం ముందుకొచ్చింది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం నోవై నగరంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ సాంస్కృతిక కేంద్రంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ (SNUSA) ఆధ్వర్యంలో “మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ 2026” పేరుతో సాంస్కృతిక నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు, సంగీత విభావరి కలబోతగా సాగిన ఈ వేడుకకు స్థానిక ప్రవాసులు, కళాకారులు, వాలంటీర్లు తరలివచ్చి మద్దతు పలికారు. భారతదేశంలోని నిరుపేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సాంస్కృతిక సాయంత్రంలో స్థానిక నాలుగు ప్రముఖ నృత్య పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది చిన్నారులు, యువతీయువకులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. గురువు త్రిపుర సుందరి భాగవతుల (శ్రీ త్రిపుర సుందరి కూచిపూడి నృత్యాలయ), గురువు సంధ్యాశ్రీ ఆత్మకూరి (నాట్యధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్), గురువు ధన్య వాణి రావు (అభినయ స్కూల్ ఆఫ్ డ్యాన్స్), గురువు ఐశ్వర్య అరుణ్ కుమార్ (నాట్యాలయ అకాడమీ ఆఫ్ భరతనాట్యం) శిక్షణలో విద్యార్థులు ఇచ్చిన సంప్రదాయ నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి.
అనంతరం జరిగిన సంగీత విభావరిలో స్థానిక గాయకులు వెంకట్ గోటూరు, భార్గవ్ గంటి, అశ్విని అయ్యర్, శ్రీరంజిత చిత్రాపు, రాధా కొల్లి, కీర్తన జగదీష్‌లతో పాటు కళ్యాణి మంత్రప్రగడ శిష్యబృందం గళం విప్పారు. ముఖ్యంగా కాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రముఖ గాయని అంజనా సౌమ్య, భారతదేశం నుంచి విచ్చేసిన ప్రముఖ గాయకుడు రాము మహారాజపురం అందించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలోని అలనాటి ఆణిముత్యాలను శ్రావ్యంగా ఆలపిస్తూ ప్రేక్షకులను సంగీత సాగరంలో ముంచెత్తారు.
కార్యక్రమంలో భాగంగా శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను వివరించారు. ఎస్‌ఎన్‌యూఎస్ఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు రమణ ముడేగంటి మాట్లాడుతూ.. గ్రామీణ భారతదేశంలో వైద్య సదుపాయాలు అందని పేద ప్రజల వద్దకే వెళ్లి శస్త్రచికిత్సలు చేసే ‘మొబైల్ ఐ సర్జికల్ యూనిట్’ (MESU) ప్రాధాన్యతను వివరించారు. దాతల సహకారంతోనే ఈ మహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో కార్యకలాపాలు 7 నగరాల నుంచి 30 నగరాలకు విస్తరించాయని, సంచార శస్త్రచికిత్సా యూనిట్లు రెండు నుంచి ఐదుకు పెరిగాయని, మరో మూడు యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ‘అడాప్ట్-ఎ-విలేజ్’ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎన్నో గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణలో ఎస్‌ఎన్‌యూఎస్ఏ డెట్రాయిట్ విభాగం ప్రతినిధులు ప్రతిమా కొడాలి (ఫౌండేషన్ చైర్), విజయ్ పెరుమాళ్ల (చాప్టర్ వైస్ ప్రెసిడెంట్), త్రిపుర సుందరి భాగవతుల (కల్చరల్ లీడ్), వెంకట్ గోటూరు, రవి కావుటారపు (చాప్టర్ లీడ్స్) బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ ఎన్‌ఆర్‌యూ, మూర్తి రేకపల్లి సహకారంతో పాటు స్థానిక ఆలయ యాజమాన్యం, స్వచ్ఛంద సేవకులు అందించిన చేయూతతో ఈ వేదిక విజయవంతమైంది. నివారించగల అంధత్వాన్ని తుడిచిపెట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.









