అమెరికా గడ్డపై తెలుగువారి సేవాదృక్పథం:
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మించిన సేవ మరొకటి లేదు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు తమ సామాజిక బాధ్యతను ఘనంగా చాటుకున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అట్లాంటాలో స్థానిక కమ్యూనిటీ కోసం ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాయి.
ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (తానా), ‘మెట్రో అట్లాంటా తెలుగు సంఘం’ (తామా) సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థతో పాటు, అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ (CGI) కార్యాలయం కూడా ఈ కమ్యూనిటీ శిబిరానికి పూర్తి స్థాయి మద్దతును, సహకారాన్ని అందించాయి.
ఈ కార్యక్రమానికి అట్లాంటా భారత కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన రాకతో ఈ శిబిరానికి మరింత శోభ, ప్రాధాన్యత ఏర్పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అండగా నిలవాలన్న ఉన్నతమైన ఉద్దేశ్యంతో భారీ సంఖ్యలో కమ్యూనిటీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం విశేషం.
తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తామా చైర్మన్ (ఫౌండేషన్ ట్రస్టీ) మధుకర్ యార్లగడ్డ, తామా ప్రెసిడెంట్ ఎలక్ట్ సునీత పొత్నూరులతో పాటు సోహిని అయినాల (ఉమెన్ సర్వీసెస్ కో-ఆర్డినేటర్), ఆర్.ఆర్. శేఖర్ కొల్లు, భరత్ మద్దినేని (బోర్డ్ డైరెక్టర్), సునీల్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కో-ఆర్డినేటర్) తదితరుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో సాఫీగా సాగింది.
సమాజ హితం కోసం ఉద్దేశించిన ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో చైతన్య కొర్రపాటి, దీప్తి తాళ్లూరి, మాలతి నాగభైరవ (తానా కళాశాల చైర్), ఆర్తిక (తానా మేట్రిమోనియల్ చైర్), తిరు చిల్లపల్లి తో పాటు స్థానిక తానా, తామా కార్యవర్గ సభ్యులు ఎంతో శ్రమించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు.. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలందరికీ, అంకితభావంతో పనిచేసిన వలంటీర్లకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
