దృష్టి కోసం సంగీత, నృత్య మహోత్సవం: ఆర్కాన్సాస్లో శంకర నేత్రాలయ నిధుల సేకరణ విజయవంతం
కంటిచూపు లేని నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే మహోన్నత ఆశయంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి నిధుల సేకరణ కార్యక్రమం ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ – 2026’ అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. అంధకారాన్ని పారద్రోలి చూపును ప్రసాదించే సేవా సంకల్పంతో బెంటన్విల్లోని ‘ది నైబర్హుడ్ చర్చి’ వేదికగా జరిగిన ఈ సాంస్కృతిక వేడుకకు ప్రవాస భారతీయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ఆర్కాన్సాస్ విభాగం ఉపాధ్యక్షుడు వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ చేపడుతున్న విస్తృత సేవా పథకాలను వివరించారు.
అనంతరం శివాలయ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు, స్థానిక సాంస్కృతిక బృందాలు ప్రదర్శించిన భారతీయ సాంప్రదాయ నృత్యాలు సభికులను కట్టిపడేశాయి. ఎస్ఎస్ఎస్ (SSS) మ్యూజిక్ బృందం నిర్వహించిన లలిత సంగీత విభావరిలో గాయకులు సుమంగళి, రాము తమ మధుర గానంతో అలరించారు. ప్రదర్శనల్లో పాల్గొన్న చిన్నారులకు పతకాలను బహూకరించడంతో పాటు వారికి శిక్షణనిచ్చిన నాట్య గురువులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో ఒక విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. శంకర నేత్రాలయ చేపట్టిన ‘అడాప్ట్ ఎ విలేజ్’ (గ్రామ దత్తత) పథకానికి ఆర్కాన్సాస్ రాష్ట్రం నుంచి మొట్టమొదటి దాతగా బాపూజీ వక్కలగడ్డ ముందుకు వచ్చారు. సమాజ హితం కోసం ఆయన చూపిన ఔదార్యాన్ని కొనియాడుతూ ఆర్కాన్సాస్ విభాగం నాయకులు ఆయన్ను వేదికపై ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా విభాగం ప్రతినిధులు అరవింద్ శివసుబ్రమణియన్, కీర్తి దీనదయాళన్, శక్తివేల్ బాలచంద్రన్, సాయి పూర్ణిమలు నేత్రదాన ప్రాముఖ్యతను, అలాగే సంచార కంటి శస్త్రచికిత్స యూనిట్ (MESU) ద్వారా గ్రామాల్లో రోగుల ముంగిటకే కంటి శస్త్రచికిత్సలను చేరుస్తున్న విధానాన్ని వీడియోల ద్వారా వివరించారు.
అమెరికా వ్యాప్తంగా శంకర నేత్రాలయ సేవలను విస్తరిస్తూ, ‘అడాప్ట్ ఎ విలేజ్’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు, ‘శంకర రత్న’ బాలరెడ్డి ఇందుర్తి నాయకత్వాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ మహత్తర కార్యక్రమ విజయానికి సమన్వయం అందించిన మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఎరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయన్, దీనదయాళన్ తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులుగా విశేష సేవలందించిన సతీష్ శ్రీనివాసన్, పాల్ వినోద్ కుమార్, సంతోష్ సీతారామన్, జగన్ రామచంద్రన్, రాజ్ యెర్లగడ్డ, చంద్రశేఖర్ పి., గణపతి రాజమణిలతో పాటు సేవా స్ఫూర్తి చాటిన హైస్కూల్, మిడిల్ స్కూల్ విద్యార్థులు సువర్ణరేఖ బాబు, అక్షర లక్ష్మణ్, తన్వి మహేష్ కుమార్, ఆదితా నవీన్ కుమార్, సరయు, రియా కీర్తి, సాధ్వి వైద్యనాథన్, నివిన్ పాల్ వినోద్ కుమార్లను నిర్వాహక వర్గం ప్రశంసించింది. రాయితీ ధరలకు విందు సమకూర్చిన భారత్ బజార్, నమస్తే ఇండియన్ గ్రోసరీ సంస్థలకు, వేదికను అందించిన చర్చి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
కంటి చూపును కాపాడే ఈ పవిత్ర సేవా యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, విరాళాలు అందించాలనుకునే దాతలు సంస్థ అధికారిక వెబ్సైట్ (www.sankaranethralayausa.org) ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.
పురుషోత్తం నారగౌని (8897388393)





