సాంస్కృతిక శాఖలో పారదర్శకత నిల్!
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత ఎక్కడికి పోతోంది? ప్రజల పన్నులతో నడిచే కార్యాలయాల్లో వివరాలు అడిగే హక్కు పౌరులకు లేదా? తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ (Department of Language and Culture) అధికారుల తీరు చూస్తుంటే ‘లేదు’ అనే సమాధానమే వస్తోంది.
సీనియర్ జర్నలిస్ట్కే అవమానం శాఖలో జరుగుతున్న నియామకాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, వారి విద్యార్హతలు మరియు బడ్జెట్ వినియోగంపై సీనియర్ జర్నలిస్ట్ ఎన్. పురుషోత్తం గత ఏడాది మార్చి 24న (24-03-2025) RTI దరఖాస్తు చేశారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారాన్ని అధికారులు 10 నెలలు గడిచినా ఇవ్వలేదు.
అంతేకాదు, వివరాల కోసం వెళ్లినప్పుడు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సిబ్బంది, దరఖాస్తుదారుని చూసి ఎగతాళిగా నవ్వడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. ఒక సీనియర్ జర్నలిస్ట్కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

27న కమిషన్ విచారణ అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) సీరియస్ అయ్యింది. అప్పీల్ (No. 8724/SIC-AR/2025)ను విచారణకు స్వీకరించి, జనవరి 27, 2026న ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాలని పిలుపునిచ్చింది.
రికార్డులు ఎందుకు దాస్తున్నారు?
- అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇచ్చారా?
- బడ్జెట్ లెక్కల్లో తేడాలు ఉన్నాయా?
- సెక్షన్ 4(1)(b) ప్రకారం ఉంచాల్సిన రికార్డులు అసలు ఉన్నాయా?
వీటిపై సమాధానం చెప్పలేకే అధికారులు మౌనం వహిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కమిషన్ విచారణలోనైనా నిజాలు బయటపడతాయా? లేదా అక్కడా దాటవేస్తారా? వేచి చూడాలి.