ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్‌ గా నియమితులైన తరువాత న్యూజెర్సి (New Jersey)కి వచ్చిన రవి మందలపు (Ravi Mandalapu) ను ఎన్నారై మిత్రులు, టీడీపి, ఇతర పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌ హాలులో జరిగిన ఈ సన్మాన వేడుకకు పలువురు ప్రముఖులు, టీడిపి, బిజెపి, జనసేన పార్టీల అభిమానులు, ఇతరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రవి మందలపు మాట్లాడుతూ, టెక్నాలజీ విప్లవంతో కుగ్రామంగా మారిన ప్రపంచంలో సమాచార బదిలీ వేగవంతమయిపోయిందని, దీన్ని అందిపుచ్చుకుని నూతన అవకాశాలను సృష్టిస్తూ ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు తనవంతుగా కృషి చేస్తానని రవి మందలపు అన్నారు. ఏపీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమి ద్వారా దీని కోసం కృషి చేస్తానని తెలిపారు. వేగంగా మారుతున్న సాంకేతిక రంగాన్ని ఆకళింపు చేసుకోవాలని, తద్వారా అభివృద్ధి, ఉద్యోగవాకాశాలను సాధించవచ్చునని అన్నారు.

కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు మిర్చీ యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన, సృజనాత్మకత కలిగిన యువతకు సరైన వేదిక లభిస్తే ప్రపంచంలోనే ముందువరుసలో ఉంటారని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించి రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఏపీని దేశంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రవి ముందువరుసలో ఉంచుతారని కొనియాడారు. ఏపీలో జరిగే నూతన ఆవిష్కరణలు రేపటి తరాలకు మార్గదర్శనం చేస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిభా పాటవాలు, ఉన్నత విద్యావంతులైన యువతకు కొదవ లేదన్నారు. వారిని ప్రోత్సహించే గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం అదృష్టమని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్‌ భీమినేని, శ్రీనాథ్‌ రావుల తదితరులు సమన్వయపరిచారు. శ్రీధర్‌ చిల్లర, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *