తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కోటపాటి గారి ఆధ్వర్యంలో, ప్రస్తుత తానా అధ్యక్షులు నరేన్ కొడాలి గారు సారథ్యంలో, డల్లాస్‌లో HEB ISD లోని పాఠశాలలకు 300 మందికి పైగా పేద విద్యార్థులకు విద్యాసామగ్రి సహాయార్థం స్కూలు బ్యాగులను అందజేశారు. అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ అనే కార్యక్రమం తానా (TANA) మాజీ అధ్యక్షులు డా. నవనీత కృష్ణ గారు ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. మన తెలుగు వారెందరికో అమెరికా జీవనోపాధి కల్పించి, సొంత పౌరులతో సమానంగా మన ఎదుగుదలకు పలు అవకాశాలు కల్పించి, మనకు ఎన్నో అవకాశాలు అందించిన అమెరికాకు సేవ చేయాలనే సంకల్పంతో, ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ‘తానా’ సంస్థ అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ నివసిస్తున్న పేద పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని సతీష్ కోటపాటి మరియు తానా కార్యవర్గం బృందం అన్నారు. ఇటువంటి సమాజసేవా కార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు, కార్యకర్తలకు తానా కార్యవర్గ బృందం ధన్యవాదాలు తెలియజేసింది.
